An IIPM Initiative
గురువారం, మే 5, 2016
 
 

యువరాజుకు పెద్దపీట

 

అవినాష్‌ మిశ్రా | జనవరి 30, 2012 10:35
 

అక్కడి పరిస్థితులు చూసి శరత్‌చంద్ర మిశ్రా ఒక రకంగా నోరు వెళ్లబెట్టారు. అవును... హమీర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల బహిరంగసభకు రాహుల్‌గాంధీ వస్తున్నారని తెలిసి అక్కడకు వచ్చి వేచి చూస్తున్న జనాలు అంత భారీ సంఖ్యలో ఉన్నారు మరి. ఆయన అంచనా ప్రకారం కనీసం 50వేల మందికి పైగానే బుందేల్‌ఖండ్‌వాసులు వచ్చారు. ''ఇంతకుముందు కాంగ్రెస్‌ సభలకు నాకు తెలిసి 1970లలో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు మాత్రమే ఇంత పెద్దస్థాయిలో జనం వచ్చేవారు'' అని మిశ్రా తెలిపారు. గాంధీ కుటుంబం గురించి ఏమైనా చెబుతున్నప్పుడు ఆయన ఒక్కసారిగా పాత రోజుల్లోకి వెళ్లిపోయి ఆనాటి మధురానుభూతులను గుర్తుచేసుకోసాగారు. గడిచిన ఐదారేళ్లుగా పదే పదే ఈ ప్రాంతానికి రాహుల్‌గాంధీ వచ్చినప్పుడు, బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని పేదల కోసం తాను ఏదోఒకటి చేస్తానని ఇచ్చిన హామీలు కొన్ని గుండెల్లో అలా ముద్ర వేసుకున్నాయి.

యువరాజు రాష్ట్రంలోకి వచ్చినప్పుడల్లా పార్టీ కార్యకర్తలకు, ఓటర్లకు మళ్లీ కాంగ్రెస్‌ లోకి రమ్మని పిలిచినప్పుడు ఎంతోకొంత ప్రభావం తప్పనిసరిగా ఉంటోంది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఢిల్లీ నుంచి నాయకులు విమానాల్లో ఎగిరి వచ్చి ఇక్కడ గ్రామాల్లో వాలి ఓట్లు అడిగే పరిస్థితి కాదు. ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల వాళ్లకు సైతం రాహుల్‌గాంధీ పేరు, తీరు ఇప్పుడు బాగా సుపరిచితం. గాల్లోంచి దిగివచ్చిన యువరాజు అంటూ ఆయన్ని ఎవరూ ఆరోపించలేరు. రాజకీయాల్లో విజయాలు సాధించలేకపోతున్నారని కూడా ఎవరూ అనలేరు. 2007లో సంగతి చూస్తే, మొదటిసారి ఆయన యూపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటికి కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ 10%కు మించి ఓట్లు, 5%కు మించి సీట్లు రాని పరిస్థితి. అయినా, 2009 లోక్‌సభ ఎన్నికల సమయానికి ఈ అపజయాల యువరాజు మాయామంత్రాలు ఏవో వేశారు. కాంగ్రెస్‌ పార్టీ 21 లోక్‌సభా స్థానాలు గెలుచుకోవడమే కాక, మరో ఏడింటిలో రెండో స్థానంలో నిలిచింది. ఇది చాలా అద్భుతమైన ఫలితం. దీంతో విమర్శకుల నోళ్లకు వెంటనే తాళాలు పడ్డాయి. గడిచిన రెండు దశాబ్దాలకు పైబడి క్షేత్రస్థాయి వరకు పార్టీ పూర్తి క్షీణదశకు చేరుకున్న సమయంలో ఇలాంటి ఫలితాలు రావడం, ఇన్ని సీట్లు గెలవడం నిజంగా అద్భుతమే మరి.

కానీ, ఓవైపు మాయావతి తోను, మరోవైపు తండ్రీ కొడుకులు ములాయం-ఆఖిలేష్‌ సింగ్‌ యాదవ్‌లతో తలపడుతున్న యువరాజు మీద అంచనాలు తారాపథంలోనే ఉన్నాయి. రాహుల్‌గాంధీ ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కొని, తనంతట తాను ఎంతో కొంత రాజకీయ లబ్ధిని సాధించడంతో పాటు, తమ పార్టీని 2014లో రాబోతున్న లోక్‌సభ ఎన్నికలకు ఎలా సన్నద్ధం చేస్తారనే విషయం ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది. తరచు ఈ ప్రాంతంలో చేస్తున్న పర్యటనలకు తోడు 2009 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో తుడిచిపెట్టుకుపోయిందని అనే ధైర్యం ఎవరూ చేయలేరు. ఇక రాహుల్‌గాంధీ విషయానికొస్తే, ఆయనకు ఈ రాష్ట్రం వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది.

2014 లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, ఒడిసా, బీహార్‌, మరికొన్ని రాష్ర్టాలలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదన్నది ఆ పార్టీ అగ్రనేతల అభిప్రాయం. ఇలాంటి సందర్భంలో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకమయ్యాయి. ఎందుకంటే, ఇక్కడ విజయం సాధిస్తే రాహుల్‌గాంధీ ఇక కొన్నాళ్ల పాటు ఇతర రాష్ర్టాల్లో కూడా పార్టీ పరిస్థితిపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఇక్కడి విజయం అనేది అంతసులభం కాదు. అలాగని మరీ నిరాశ కూడా చెందనక్కర్లేదు. ''1979-80లలో ఇందిరాగాంధీ ఎదుర్కొన్న పరిస్థితి లాంటిదే ఇప్పుడు కూడా ఉంది. అప్పట్లో ఉత్తరప్రదేశ్‌ ఓటర్లు జనతాపార్టీ అంటే బాగా విసుగెత్తిపోయారు. ఇప్పుడు వాళ్లు బీఎస్పీ అంటే మండిపడుతున్నారు'' అని కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారీ అన్నారు. రాహుల్‌గాంధీ హవా రాష్ట్రంలో బాగా కొనసాగుతోందని, అందువల్ల పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సైతం పుష్కలంగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

అయితే ఇదంతా కేవలం ఆశాభావం మాత్రమేనని చెప్పడంలో మనకు అనుమానం లేదు. అలాగని ఇలాంటి ఆశాభావం కాస్తా విశ్వాసంగా మారబోదని కూడా కొట్టి పారేయడానికి వీల్లేదు. 2007లో పరిస్థితికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పటికి కాంగ్రెస్‌ ఎంతగా అరిచి గీపెట్టినా ఓటికుండ శబ్దం మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో అనేక ఎన్నికలను కళ్లారా చూసిన సీనియర్‌ పాత్రికేయుడు విజయ్‌ ఉపాధ్యాయ అక్కడి పరిస్థితిని ఇలా వివరించారు. ''రాహుల్‌గాంధీ హాజరవుతున్న ప్రతి సమావేశానికి, బహిరంగ సభకు జనం కుప్పలుతెప్పలుగా వస్తున్నారనడంలోఅనుమానం లేదు. రాహుల్‌ కూడా చాలా ఆశాభావంతోనే ఉన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా యువత మాత్రం ఆయన వెంటనే ఉన్నారు'' అని తెలిపారు. ఇది నిజంగా ఓ కొత్త వార్తే! గడిచిన రెండు దశాబ్దాలకు పైబడి కాంగ్రెస్‌ పతనాన్ని చూసిన ఓ జర్నలిస్టు నోటివెంట వచ్చిన వార్త ఇది!!

కానీ, విశ్లేషకులు మాత్రం ఈ వాదనతో ఇంకా పూర్తిగా ఏకీభవించడంలేదు. ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్‌గాంధీ మాత్రమే ఓట్లు సాధించగలరు అనడం సరికాదని, క్షేత్రస్థాయి నుంచి పార్టీ పటిష్ఠంగా ఉంటేనే అద్భుతాలు సాధ్యమవుతాయని చెబుతున్నారు. కానీ చాలావరకు నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఇంకాలేదు. కానీ, రాహుల్‌గాంధీకి... కాంగ్రెస్‌ పార్టీకి విధేయతతో ఉన్నవారు మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఈ కథనానికి రేటింగ్ ఇవ్వండి:
చెడ్డది మంచిది    
ప్రస్తుత రేటింగ్ 1.0
Next Story

తరువాతి కథనం

Post CommentsPost Comments
సంచిక తేదీ: జూన్ 3, 2013

చిత్రాలు
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన