An IIPM Initiative
సోమవారం, మే 2, 2016
 
 

అందరికీ వరం వ్యయభారాలు లేని వైద్యం

 

టి.సతీశన్‌ | Issue Dated: ఫిబ్రవరి 19, 2012
 

దేశంలోనే అత్యుత్తమ అక్షరాస్యత ఉన్న రాష్ర్టాల్లో కేరళ ఒకటి అనడంలో అనుమానంలేదు. ఇప్పుడు ఇదే ర్యాంకు ప్రజారోగ్యం విషయంలో డా వస్తోంది. ఇతర రాష్ర్టాల్లోలా కాకుండా.. గ్రామస్థులకు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు, నిపుణులైన డాక్టర్లు ఉండటంలో కేరళ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించింది. ఎర్నాకులం జిల్లాలో ఉదాహరణను ద సండే ఇండియన్‌ బృందం పరిశీలించింది. ఒకప్పు  డు ఈ జిల్లాలో జనసాంద్రత, కాలుష్యం ఎక్కువగా ఉండటంతో రకరకాల వ్యాధులు ఇబ్బందిపెట్టేవి. తత్ఫలితంగా అక్కడ టైఫాయిడ్‌ ఎక్కువగా కనిపించేది, చాలామందికి ఆస్థమా కూడా ఉండేది. పైనాపిల్‌తోటల్లో పనిచేయడం వల్ల ర్యాట్‌ఫీవర్‌ కూడావచ్చేది. ''ఈ జిల్లా చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. పారిశ్రామిక, వాహన కాలుష్యం కూడా చాలా ఎక్కువ. జిల్లా మీద జనసాంద్రత భారం కూడా ఎక్కువే'' అని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుధాకరన్‌ తెలిపారు.

తాజా తాగునీరు లేకపోవడం ఈ ప్రాంతవాసులు ఎదుర్కొనే ప్రధాన కష్టాల్లో ఒకటి. మంచినీటి పైపులైన్లు డ్రెయిన్ల గుండా వెళ్తుంటాయి. అవి ఎప్పుడైనా పగిలాయంటే చాలు.. నీటి కాలుష్యం వస్తుంది. సేంద్రియ, నిరింద్రియ వ్యర్థాల సమస్య కూడా ఉంది. సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాలను ట్యాంకర్లలో సేకరించి వీటిని నేరుగా కాలువలు, నదుల్లో వదలడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడేవి. ''చాలా సమస్యలకు ప్రజల బాధ్యతారహిత ప్రవర్తనే కారణం. అసలు చెత్తశుద్ధి వ్యవస్థ అంటూ లేకపోవడంతో ఏం చేసినా ప్రయోజనం కనపడదు'' అని డాక్టర్‌ సుధాకరన్‌ చెప్పారు.

వలసకూలీలు భారీ సంఖ్యలో రావడం కూడా ఈ పరిస్థితికి కొంతకారణం అవుతుంది. ''ఇక్కడకొచ్చే వలస కూలీల్లో చాలామందికి పొగాకు అలవాటు ఉంది. దుకాణదారులు వాళ్ల కోసం పొగాకు ఉత్పత్తుల స్టాకు తెచ్చిపెట్టుకుంటారు, దానివల్ల స్థానికులకు కూడా అది అలవాటవుతుంది'' అని ఆయన టీఎస్‌ఐకి చెప్పారు. ఈ జిల్లా చాలా వైవిధ్యమైనది. వాతావరణం ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. చిన్నచిన్న కుంటలు ఎక్కడపడితే అక్కడ ఉండటంతో దోమలకు ఆవాసాలై మలేరియా, డెంగ్యూ వ్యాపిస్తున్నాయి. ''నీటి కాలుష్యం వల్ల టైఫాయిడ్‌, పారిశ్రామిక కాలుష్యం వల్ల ఆస్థమా వస్తున్నాయి. వర్షాల వల్ల కుంటల్లో నీరు నిలిచి దోమలు వస్తున్నాయి'' అని డీఎంవో తెలిపారు.

ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ పలు ప్రాంతాల్లో జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకుంది. మలేరియాతో పాటు, నీటివల్ల వచ్చే ఇతర వ్యాధులను అరికట్టడానికి ఆరోగ్యశాఖ  త్రైమాసిక దోమల నివారణ చర్యలు చేపట్టింది. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు తరచు యాంటీ లెప్టోస్పిరోసిస్‌ టాబ్లెట్లు ఇచ్చేవారు. పైనాపిల్‌ తోటల్లో పనిచేసేవారికి గమ్‌ బూట్లు, గ్లోవ్స్‌ సరఫరా చేశారు. ప్రతి విషయంలోనూ ముందుగా కాస్త ఉపశమనం కల్పించి, తర్వాత  రెండోదశలో దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేసింది.

కేరళలో రాష్ట్ర ఆరోగ్యశాఖ పనితీరు ప్రశంసనీయంగా ఉంది. కొట్టాయం జిల్లాలో పొగాకు వ్యతిరేక చర్యలు ఫలితాలనిచ్చాయ. కొట్టాయం మొత్తం ఎక్కడా పొగాకు కనపడని జిల్లాగా ప్రకటించారు. కొచ్చి సమీపంలోని అలువాలోని జిల్లా ఆస్పత్రిలో రోగులకు అద్భుతమైన డయాలసిస్‌ సేవలు అందుతున్నాయి. ఈ ప్రాంతం ఇక్కడి బ్లడ్‌బ్యాంకు పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ బ్లడ్‌బ్యాంకులో ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. డెంగ్యూ చికిత్సలో ఇవి కీలకం.'' ఈ బ్లడ్‌బ్యాంకు చాలా మంచి పని చేస్తుంది. మూడు సార్లు దీనికి అవార్డు వచ్చింది''అని ఎర్నాకులం జిల్లా అదనపు డీఎంవో డాక్టర్‌ హసీనా మహ్మద్‌ తెలిపారు.
అత్యంత అరుదైన రక్తం కూడా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా డాక్టర్‌ విజయకుమార్‌ ఈ బ్లడ్‌బ్యాంకును తీర్చిదిద్దారు. ప్రస్తుతానికి ఆయన పదవీవిరమణ చేసినా కూడా రక్తసేకరణ ఉద్యమాన్ని చేపట్టి ముందుకు నడిపిస్తున్నారు. గడిచిన పదేళ్లలో ఆయన 384 రక్తదానశిబిరాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించి, వారిని తమ బ్లడ్‌బ్యాంకుకు రక్తదానం చేసేలా ప్రోత్సహించారు. రక్తం సులభంగా దొరకడంతో నిరుపేదలు కూడా ఆస్పత్రికి చికిత్సచేయించుకోడానికి వస్తారు.

ఇటీవలే అలువా తాలూకా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా స్థాయి పెంచారు. అలువాలోని డయాలసిస్‌ కేంద్రం చాలా ప్రసిద్ధి చెందింది. సుదూర ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చి ఇక్కడి ఉచితవైద్యం పొందుతారు. ఇక్కడ ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా 12 డయాలసిస్‌ యూనిట్లు ఉండగా, ప్రభుత్వేతర సిబ్బందితో నడుస్తుంది. రెండు షిఫ్టులలో 24 మంది రోజుకు ఇక్కడ చికిత్స పొందగలరు. అంటే, వారానికి 144 మంది అన్నమాట. ఇక్కడ మనిషికి డయాలసిస్‌కు వసూలుచేసే ఫీజు 200. కొంతమంది దాతలు ఈ కేంద్రానికి విరాళాలు ఇవ్వడంతో డయాలిసిస్‌ కేంద్రాన్ని నిర్వహించడానికి అయ్యే ఖర్చుతో పాటు సిబ్బంది జీతాలు కూడా చెల్లించడం సులభం అవుతోంది. అందుకే అందరికీ అందుబాటులో డయాలసిస్‌ వ్యయం ఉంటోంది. ''ఈ జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యుడు పి.రాజీవ్‌ విరాళమే లేకపోతే అసలు డయాలిసస్‌ సెంటర్‌ వచ్చేదే కాదు. భవన నిర్మాణం, యంత్రాల కొనుగోళ్లు అన్నీ ఎంపీ కారణంగానే అయ్యాయి. ఆయన తన ఎంపీలాడ్స్‌ నిధులను దీనికి కేటాయించారు. ఈ కేంద్రం ప్రశాంతంగా నడిచేలా ఆయన చొరవ తీసుకుంటారు, ప్రతిరోజూ ఇక్కడి కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకుంటారు'' అని డాక్టర్‌ విజయకుమార్‌ చెప్పారు.

అలువాలో సాధించిన విజయం చూసి, ఆరోగ్యశాఖ మాజీమంత్రి శ్రీమతి టీచర్‌ ప్రతి జిల్లాలోనూ ఒక్కో డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు. కానీ, ప్రభుత్వం దీనిపై అంత ఆసక్తి చూపించలేదు. ఇక కేరళలో మామూలు ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆయుర్వేద ఆస్పత్రులు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ప్రతి జిల్లాలోనూ ఒక్కో ఆయుర్వేద ఆస్పత్రి ఉంది. ''ఆయుర్వేద ఆస్పత్రులలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న రోగులకు ఉచిత చికిత్సలు అందజేస్తాం. మందులు కూడా అవసరమైన వారికి ఉచితంగానే ఇస్తాం'' అని ఎర్నాకులం డీఎంవో (ఆయుర్వేదం) డాక్టర్‌ రెక్స్‌ పి. నెల్సన్‌ తెలిపారు. ఎర్నాకులం జిల్లాలో 'తిరుమ్మల్‌', 'కిళి' లాంటి ఆయుర్వేద చికిత్సలు (సాధారణంగా అవి చాలా ఖరీదైనవి. ఒక్కో సిట్టింగ్‌కే రూ. 25 వేల వరకు అవుతాయి) కూడా ప్రజలకు ఉచితంగా చేస్తుంటారు.

ఆయుర్వేదం లాగే, హోమియో చికిత్స కూడా కేరళలో అందరికీ అందుబాటులో ఉంటుంది. కేరళలో దాదాపు ప్రతి పంచాయతీలోనూ ఒక్కో హోమియోపతి ఆస్పత్రి ఉందని చెబుతారు. ఈ ఆస్పత్రులను నడిపే వైద్యులు రోగులకు మందులు ఉచితంగానే ఇస్తారు. ''సగటను రోజూ 35-40 మంది రోగులు ఈ ఆస్పత్రులకు వస్తుంటారు'' అని హోమియో వైద్యుడు డాక్టర్‌ షాజీ మాథ్యూ తెలిపారు. మొత్తమ్మీద కేరళలో సామాన్య మానవుడికి కూడా అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోనే ఉంటున్నాయి. ఈ ఆస్పత్రులు సరిగా లేకపోతే అసలు ఇలాంటివి వారికి అందేవే కావు. ఇది వైద్యులు, ఉన్నతాధికారులు, చివరకు రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరూ సహకరించడం వల్లనే సాధ్యమయ్యింది. ప్రతి ఒక్కరూ ఈ కలను నిజం చేసుకోడానికి తమవంతు కృషిచేశారు. ఇతర రాష్ర్టాలు కూడా కేరళ తరహా విధానాలను అవలంబించవచ్చు.
 


 

ఈ కథనానికి రేటింగ్ ఇవ్వండి:
చెడ్డది మంచిది    
ప్రస్తుత రేటింగ్ 0
Post CommentsPost Comments
సంచిక తేదీ: జూన్ 3, 2013

చిత్రాలు
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన