An IIPM Initiative
బుధవరం, మే 4, 2016
 
 

రెచ్చగొడుతున్న చైనా..

 

మయాంక్‌సింగ్‌ | జనవరి 17, 2012 13:32
 

గత సంవత్సరం ఢిల్లీలో చైనా రాయబారి ఝాంగ్‌యాన్‌ ఓ భారత విలేకరిని 'నోర్మూసుకో' అని అరిచారు. భారతదేశ పటంలో సరిహద్దులను మార్చేయడంపై ఆ విలేకరి వాగ్వాదానికి దిగడమే అందుకు కారణం.  ఇటీవలే షాంఘై సమీపంలోని ఓ చైనీస్‌ పట్టణంలో కోర్టులో భారత దౌత్యవేత్త ఒకరు కుప్పకూలిపోయారు. ఆయనకు ఆరు గంటల పాటు ఆహారం, మందులు ఇవ్వకపోవడమే అందుకు కారణం. ఇద్దరు భారతీయ వ్యాపారులను విడిపించే విషయమై కోర్టులో వాదనలకు ఆయన హాజరయ్యారు.

అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ఎయిర్‌ఫోర్స్‌ అధికారికి చైనా తాజాగా వీసా నిరాకరించింది. ఆ ప్రాంతం వివాదాస్పదమని బీజింగ్‌ భావించడమే అందుకు కారణం.

భారతదేశానికి సంబంధించిన విషయాల్లో చైనా కావాలని రెచ్చగొడుతూ చేసే ప్రకటనలు, చేష్టల వల్ల ఇప్పటికే ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలావరకు చెడిపోయాయి. ఇప్పుడు కొత్తగా చేస్తున్న చేష్టలు మరెంత దూరం తీసుకెళ్తాయోనని పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. కానీ, దీనికి సమాధానం అంత సులభం కాదు. భారత్‌, చైనాల మధ్య సంబంధాలు చాలా సంక్లిష్టమైనవి. ఆ తర్వాత, రాయబారి ఝాంగ్‌ యాన్‌ చైనా, భారత్‌ల మధ్య ''విరోధ సంబంధాల''కు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. అన్నిరంగాల్లో సహకారం ఉండాలన్నారు. కానీ, ఇటీవలి కాలంలో చైనా పెడసరంగా వ్యవహరించడంతో పరిస్థితులు బాగా మారుతున్నాయి.

జవహర్ లాల్‌నెహ్రూ యూనివర్సిటీలో చైనా వ్యవహారాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అల్కా ఆచార్య ఈ విషయమై ఇలా వివరించారు.. ''చైనా భారత సంబంధాల మధ్య ఉన్న సంక్లిష్టత అంత సులభంగా అర్థం కాదు. పాశ్చాత్యమీడియా దీన్నెప్పుడూ ఒకే కోణంలో చూపిస్తుంది. ఇక మన దేశంలో గొడవలను ఎప్పుడూ పెద్దగా చూపిస్తారు గానీ, సానుకూల అంశాలను అసలు చెప్పనే చెప్పరు'' అన్నారు.

చైనాకు సంబంధించిన పరిణామాల విషయంలో భారత ప్రతిస్పందన చాలా పేలవంగా ఉంటుందని అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాష్‌ చెబుతారు. ''ఇరుగుపొరుగు దేశాలు మన సాయం కోరుతుంటాయి. కానీ చైనా అప్పటికే అక్కడకు వెళ్లిపోయినా, మన ప్రతిస్పందన మాత్రం చాలా ఆలస్యమవుతుంది. హంబన్‌తోట రేవు నిర్మాణం కోసం శ్రీలంక తొలి ఆఫర్‌ను భారత్‌కే ఇచ్చిందిగానీ, చైనా ఆ కాంట్రాక్టు దక్కించుకుంది. అలాగే స్టిల్‌వెల్‌రోడ్డు నిర్మించాలని మయన్మార్‌ కోరగా, మనం శషభిషలలో ఉండగానే చైనా ఆ నిర్మాణం మొదలుపెట్టేసింది'' అన్నారు. మన లోపాలకు చైనాను నిందించడానికి బదులు ముందు అసలు మనమేం చేస్తున్నామో చూడాలని చెప్పారు. మన విధానాలు మరింత చురుగ్గా ఉండాలని సూచించారు.  ఒకప్పుడు సరిహద్దు సమస్య మరీ తీవ్రంగా ఉండటంతో భారత్‌, చైనాల మధ్య ప్రతి చిన్న విషయానికీ అదే అడ్డంకిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లోనూ సంబంధాలు చాలావరకు బలపడుతున్నాయి.

కానీ, రెండుదేశాల మధ్య వైవిధ్యం మాత్రం అలాగే ఉంది. ఓవైపు ఇరుదేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగింది, మరోవైపు పరస్పర నమ్మకం, విశ్వాసం మాత్రం తగ్గుతూనే వచ్చాయి.  టిబెట్‌, తైవాన్‌ల విషయంలో భారత్‌ విధానం సుస్థిరంగా ఉండటాన్ని చైనా అంతగా జీర్ణించుకోలేకపోతోంది. భారత భూభాగంపై చైనా వ్యతిరేక కార్యక్రమాలను గట్టిగానే నిరోధించారు. పైగా, ఇటు భారత్‌లోగానీ, అటు చైనాలో గానీ ఈ దేశం కాబట్టి నిషేధం విధించాలన్న యోచన ఏదీ పెట్టుబడుల విషయంలో లేదు.

స్ర్టాటజిక్‌ ఎకనమిక్‌ డైలాగ్‌ (ఎస్‌ఈడీ), యాన్యువల్‌ డిఫెన్స్‌ డైలాగ్‌ (ఏడీడీ)ల విషయాల్లో చాలా పటిష్ఠమైన వ్యవస్థలు ఉన్నాయి. మొదట్లో ఢిల్లీలోని అంతర్జాతీయ బద్ధ సదస్సులో దలైలామా ప్రసంగం కారణంగా కొంత విభేదాలు తలెత్తినా, భారత్‌, చైనాలు రెండూ కూడా ఏడీడీ విషయంలో ముందుకు వెళ్లడానికి ఆమోదం తెలిపి చాలా పరిపక్వత చూపించాయి. ఇదే పరిపక్వత కారణంగా భారత రక్షణ బృందం చైనాకు వెళ్లడానికి ఆమోదం లభించింది. అయితే, గ్రూప్‌ కెప్టెన్‌ ఎం. పాంగింగ్‌ అనే ఎయిర్‌ఫోర్స్‌ అధికారికి మాత్రం వీసాను నిరాకరించారు. అదే సమయంలో, చైనాతో ఎస్‌ఈడీ వ్యవస్థలో ముందుకు వెళ్లిన దేశాల్లో అమెరికా తర్వాత ఉన్న దేశం భారత్‌ ఒక్కటే కావడం గమనార్హం.  కానీ అదే సమయంలో టిబెట్‌తో పాటు, భారత్‌ దాయాది దేశాలు (ముఖ్యంగా పాకిస్థాన్‌లో) చైనా చేపడుతున్న కవ్వింపు చర్యల కారణంగా పరిస్థితులు కొంత వేడెక్కుతున్న మాట మాత్రం వాస్తవం.

ఇక హిందూ మహా సముద్రం ప్రాంతంలో  నావికాదళ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్న చైనా ఆలోచనలపై భారత్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ప్రాంతం భారత్‌కు చాలా కీలకం. కానీ, కేవలం చైనా వాణిజ్యం కోసం ఇంత కీలకమైన సముద్ర ప్రాంతాన్ని ఇంతలా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందా?

చైనా-భారత సరిహద్దు సమస్య మొత్తం అపార్థాలు, అపోహలు, పరస్పర అనుమానాలతో కూడిన రాజకీయాల వల్లనే తలెత్తిందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగుదేశంలో ఉన్న ఉద్రిక్త కేంద్రాలను పరిష్కరించుకోవడం, ఇరుగుపొరుగు దేశాలతో.. ముఖ్యంగా చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం భారత్‌కు అత్యుత్తమ వ్యూహంగా ఉండగలదు.

దీనిపై సైన్యానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి స్పందిస్తూ, ''చైనా ఎలాంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుంటున్నా, అదంతా తన సొంత భూభాగంపైనే చేస్తోంది. అలాగే, మన సరిహద్దుల్లో మనవైపు అలా చేయకుండా మనల్ని ఎవరైనా ఆపారా?'' అని ప్రశ్నించారు. అయితే, అక్కడ జరుగుతున్న మార్పులను కూడా మనం చాలా జాగ్రత్తగాగమనించాలని ఆయన తెలిపారు.  టిబెట్‌లో ఇటీవల అభివృద్ధి చేసిన ఆరు ఎయిర్‌ఫీల్డులు, అన్నిరకాల వాతావరణ పరిస్థితులకు సరిపోయే రహదారి నెట్‌వర్క్‌ను ఆయన గుర్తుచేశారు. ''టిబెట్‌, ఉయిఘుర్‌ ప్రాంతాల్లో వరుస సంఘటనల కారణంగా తప్పనిసరిగా దళాలను మోహరించాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవించినా వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండేందుకే చైనా ఇలా చేస్తోందని మనం భావించవచ్చు'' అని ఆయన వివరించారు.

అయితే, ఇవే మౌలిక సదుపాయాలను ఇతర ప్రయోజనాలకూ వాడకూడదని ఏమీ లేదు. కానీ.. ''టిబెట్‌‌, ఉయిఘర్‌ లాంటి చిన్న జనాభా ఉన్న ప్రాంతాలలో ఇంత పెద్దస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఏముంది?'' అని ఆయన ప్రశ్నించారు.
మెక్‌మోహన్‌ లైన్‌ చట్టబద్ధతను చైనా తరచు ప్రశ్నిస్తూనే ఉంది. మరోవైపు సరిహద్దుల గురించి తమ వాదనలను కూడా వాళ్లు ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. టిబెట్‌ విషయంలో మనం సుస్థిర అభిప్రాయంతోనే ఉండగా, గ్రూప్‌ కెప్టెన్‌ ఎం. పాంగింగ్‌కు వీసా నిరాకరించడాన్ని తప్పుగానే మనం చూడొచ్చు, దానిపై వాళ్లను ప్రశ్నించొచ్చు కూడా. కానీ, టిబెట్‌ అటానమస్‌ ప్రాంతంలో నియమించిన పీఎల్‌ఏ అధికారులను భారత్‌లో సైనిక ప్రాతినిధ్య బృందాల లోపంవద్దని.. దానివల్ల మన అతిథులైన టిబెటన్‌ శరణార్థులు ఇబ్బంది పడతారని బీజింగ్‌కు చెప్పడానికి భారత్‌ ఎప్పుడైనా ప్రయత్నించిందా?

1998 మే నాటి అణ్వస్త్ర ప్రయోగాలు ఇరుదేశాల సంబంధాలలో కీలక, వ్యూహాత్మక మార్పులకు దారితీశాయి. అమెరికాతో మన దేశం కుదుర్చుకున్న అణు ఒప్పందం చూసి కూడా చైనాలో విధాన నిర్ణేతలు ఆందోళనలు వ్యక్తం చేశారు. అమెరికాను తమకు వ్యూహాత్మకంగా ప్రాథమిక శతృవుగానే చైనా భావిస్తుంది. చైనా కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కావాలని, దాని సైనికబలం కూడా చైనా చుట్టుపక్కలకు, దాని మిత్రదేశాలకే పరిమితం కావాలని అమెరికా అనుకుంటుంది.

నిజానికి చైనా ఇంతలా ఎదుగుతుండటాన్ని ప్రస్తుత ఆర్థిక ప్రపంచీకరణ యుగంలో సానుకూల దృక్పథంతోనే చూడాల్సిన అవసరం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం అనేది భారత్‌-చైనా సంబంధాల పునరుద్ధరణకు అత్యంత నమ్మదగిన మార్గంగా కనిపిస్తోంది. 2015 నాటికి ఇది 100బిలియన్‌ డాలర్ల స్థాయిని దాటొచ్చు.

కానీ, దీర్ఘకాలంలో చూస్తే వాణిజ్య భాగస్వాములుగా ఇంకా రెండుదేశాలూ పూర్తిస్థాయిలో రూపొందలేదు. ఇన్నాళ్లబట్టి ఉన్న సమస్యాత్మక రాజకీయ సంబంధాలు ఆ తీరు నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. కనీసం ఇప్పటికైనా భారత్‌, చైనా రెండూ కూడా సరిహద్దు సమస్యలు ఉన్నా, స్టేపుల్డ్‌ వీసా సమస్య ఉన్నా, టిబెట్‌ సమస్య ఉన్నా.. ఇలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం తాము తగువిధంగా ప్రవర్తించగల సామర్థ్యం ఉన్నవారమని నిరూపించుకున్నాయి. అయితే, అదే సమయంలో మనం చైనా-పాకిస్థాన్‌ సంబంధాలను, భారత్‌-అమెరికా భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దక్షిణ చైనా సముద్రంతో పాటు హిందూ మహా సముద్రంలో చైనా కార్యకలాపాలు, కదలికలు అనుమానాస్పదంగా ఉన్నంతకాలం ఈ జాగ్రత్త తప్పదు

ఈ కథనానికి రేటింగ్ ఇవ్వండి:
చెడ్డది మంచిది    
ప్రస్తుత రేటింగ్ 3.4
Post CommentsPost Comments
సంచిక తేదీ: జూన్ 3, 2013

చిత్రాలు
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన